శ్రీశైలం ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డ్డవారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 

విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్ర‌మాదంలో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించారు. ప్రమాద సమయంలో 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 10 మంది సుర‌క్షితంగా బ‌య‌టప‌డ్డారు. లోప‌ల చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాతప‌డ్డారు.

శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడం బాధేసింది. నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించే’ నని వెంకయ్య నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ అగ్నిప్ర‌మాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న స్పందిస్తూ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతిచెందార‌న్న స‌మాచారం తెలిసి తీవ్ర ఆవేద‌న క‌లిగింద‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ  గాయ‌ప‌డ్డ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.