రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇటీవల కాలంలో బలమైన రాజకీయ ప్రత్యర్థిగా మారిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(44) విష ప్రయోగానికి గురయిన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన కోమాలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
ఆయన సైబీరియా నుంచి మాస్కోకి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లి అపస్మారకస్థితిలో కింద పడిపోయారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓమ్స్క్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ ట్విటర్ ద్వారా తెలిపారు. నావల్నీ ఉదయం బోర్డింగ్ సమయంలో ఎయిర్ పోర్టులో టీ తాగారని, అది తప్ప మరేమీ తీసుకోలేదని చెప్పారు. టీలోనే విషం కలిపి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు.
విమానంలోకి ఎక్కిన తరువాత ఆయనకు చెమటలు పట్టాయని, తనని మాట్లాడుతూ ఉండమని కోరారని, తద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా ఉండొచ్చని చెప్పారని కిరా యార్మిష్ తెలిపారు. తరువాత బాత్రూంకి వెళ్లి కిందపడిపోయారని వెల్లడించారు.
రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో బలమైన నేతగా ఎదిగారు. ఆయన ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే అవినీతి ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయనపై పలుమార్లు దాడులు కూడా జరిగాయి.
దీనికి ముందు కూడా ఒకసారి ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ విష ప్రయోగం అధ్యక్షుడు పుతిన్ చేయించి వుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
లెబనాన్, సిరియాలలో ఒకేసారి పేలిపోయిన వేలాది ‘పేజర్లు’
ఆసియా చాంఫియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్
రష్యాలో పిల్లల కోసం భోజన విరామంలో శృంగారం