డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్

అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు.  ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఆయ‌న పోటీప‌డుతారు.  డెమోక్ర‌టిక్ పార్టీ స‌మావేశంలో బైడెన్ ప్ర‌క‌ట‌న చేశారు.

ఆ పార్టీకి చెందిన మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్, జిమ్మీ కార్ట‌ర్‌లు బైడెన్‌ను అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించారు.  మాజీ విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ కూడా త‌న మ‌ద్ద‌తు తెలిపారు. అధికారికంగా అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో బైడెన్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.  పార్టీ నామినేష‌న్‌ను అంగీక‌రించ‌డం త‌న జీవితానికి గౌర‌వంగా భావిస్తాన‌ని బైడెన్ తెలిపారు.

ఓవ‌ల్ ఆఫీసు ప్ర‌తిష్ట‌ను డోనాల్డ్ ట్రంప్ దిగ‌జార్చిన‌ట్లు మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ ఆరోపించారు. పార్టీ క‌న్వెన్ష‌న్‌లో క్లింట‌న్ కీల‌క ఉప‌న్యాసం చేస్తూ ప్ర‌పంచంలో మ‌నం ముందంజ‌లో ఉన్న‌ట్లు ట్రంప్ చెబుతున్నారని, కానీ మ‌న దేశంలో నిరుద్యోగం మూడింత‌లు పెరిగిన‌ట్లు ధ్వజమెత్తారు. 

ఇలాంటి స‌మ‌యంలో ఓవ‌ల్ ఆఫీసు ఓ కమాండ్ సెంట‌ర్‌లో ఉండాల‌ని, కానీ అది తుఫాన్ కేంద్రంగా ఉంద‌ని, అక్క‌డ అంతా గంద‌ర‌గోళ‌మే నెల‌కొన్న‌ద‌ని విమ‌ర్శ‌లు చేశారు. బైడెన్‌ను అధ్య‌క్ష అభ్య‌ర్థిగా నామినేట్ చేస్తూ 50 రాష్ట్రాలు అనుకూలంగా ఓటేశాయి. క‌రోనా నేప‌థ్యంలో పార్టీ స‌మావేశాలు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో సాగాయి. 

అయితే నాలుగ‌వ రోజున స‌మావేశాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న‌ట్లు బైడెన్ తెలిపారు. ఓపీనియ‌న్ పోల్స్ ప్ర‌కార. ట్రంప్ వెనుకంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శ్వేత సౌధానికి బైడెన్ రేసులో నిల‌బ‌డ‌డం ఇది మూడ‌వ‌సారి.