వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ తో రష్యా జట్టు!

కరోనా వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ అప్రూవల్ ఇచ్చిన తొలి దేశంగా నిలిచినా  రష్యా వచ్చే వారంలో 40 వేల మందిపై స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాలని  నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ను భారీస్థాయిలో ఉత్పత్తి చేయడంపై రష్యా దృష్టి సారించింది. 

వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారత్ తో జట్టు కట్టాలని రష్యా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి మీద భారత్  సామర్థ్యంపై రష్యా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది. స్పుత్నిక్ వీ సహాయం కోసం ఎదురు చూస్తోందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌‌డీఐఎఫ్​) సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్ చెప్పారు. 

అత్యుత్తమ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన దేశాల్లో భారత్  ఒకటని పేర్కొన్న కిరిల్‌ వ్యాక్సిన్ ఉత్పత్తి కీలకమని, దీని కోసం భారతీయ కంపెనీలతో భాగస్వామ్యానికి యత్నిస్తున్నామని వెల్లడించారు.

‘మేం క్షుణ్నంగా అధ్యయనం చేశాం. మా సామర్థ్యాలను అంచనా వేశాం. ఈ విషయంలో భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, క్యూబా లాంటి దేశాలకు అద్భుతమైన ఉత్పత్తి సామర్థం ఉంది’ అని తెలిపారు. 

వీటిలో నుంచి ఏ దేశం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ సృష్టికి ఇంటర్నేషనల్ హబ్‌గా మారుతుందో చూడాలని అంటూ భారతీయ డ్రగ్ ఉత్పత్తిదారులు తమతో సహ భాగస్వామిగా ఉంటారేమో చూడాలని పేర్కొన్నారు. 

“గమలెయా ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్ కు  ఉందని మేం విశ్వసిస్తున్నాం. అయితే ఈ భాగస్వామ్యం మాకు వచ్చిన డిమాండ్‌కు తగ్గస్థాయిలో ఉత్పత్తి  చేయగలగాలి” అని కిరిల్ వివరించారు.