శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం  

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్‌ టెర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. 

పొగలు రావడాన్ని గమనించి డిఇ పవన్‌కుమార్‌తో పాటు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. చూస్తూ ఉండగానే కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. షార్ట్‌ సర్కూట్‌ వల్ల ప్యానల్‌ బోర్డులలో ఏర్పడిన మంటలకు భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయి. 

ప్రమాద సమయంలో విధుల్లో సుమారు 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎఇలు , 6 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పోలీసులు, రక్షణ సిబ్బంది తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లోపలున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,  నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

జల విద్యుత్‌ కేంద్ర నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరి ఫోన్లు గంటపాటు పని చేసినా తరువాత స్పందించకపోవడంతో సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే చిక్కుకుపోయిన సిబ్బందిని కాపాడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

జల విద్యుత్‌ కేంద్రంలో భారీగా పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రమైన పొగ కారణంగా ఆక్సిజన్‌ పెట్టుకున్నా ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. అవసరమైతే సింగరేణి సిబ్బంది సాయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. 

పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్ కో సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రీషన్లు ఉన్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు