జమ్ముకశ్మీర్ నుంచి భద్రతా సిబ్బంది వెనక్కి

జమ్ముకశ్మీర్ నుంచి భద్రతా సిబ్బంది వెనక్కి
జమ్ముకశ్మీర్‌లో మోహరించిన భద్రతా దళాల్లో వంద కంపెనీలను వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 40 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్), 20 కంపెనీల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), 20 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్), 20 కంపెనీల సహస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ) బలగాలు తమ తమ స్థావరాలకు వెంటనే తిరిగి వెళ్లి అక్కడ రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. 
 
దీంతో సుమారు పది వేల మంది భద్రతా సిబ్బంది జమ్ముకశ్మీర్ నుంచి వైదొలగనున్నారు. జమ్ముకశ్మీర్ లోని భద్రతా పరిస్థితులపై బుధవారం సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు ఏడాదిన్నర కాలంగా అక్కడ ఉన్న భద్రతా దళాలకు విశ్రాంతి కల్పించేందుకు కేంద్రం వారిని వెనక్కి రప్పిస్తున్నదని తెలుస్తున్నది. 
 
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపతి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కాగా, గత ఏడాది డిసెంబర్ లో 82 కంపెనీల బలగాలను కేంద్రం ఉపసంహరించింది.
 
మరోవైపు జమ్ముకశ్మీర్ విభజన జరిగి ఆగస్టు5తో ఏడాది పూర్తయిన సందర్భంగా అక్కడి భద్రతా పరమైన పరిస్థితులను సమీక్షించిన కేంద్రం వంద కంపెనీల భద్రతా బలగాలను వెనక్కి మళ్లించే చర్యలు చేపట్టింది. అయితే ఈ భద్రతా సిబ్బంది వైదొలగినప్పటికీ జమ్ముకశ్మీర్‌లో ఇంకా 400 కంపెనీల అదనపు పారామిలిటరీతోపాటు 67 బెటాలియన్ల రెగ్యులర్ సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీస్ బలగాలు ఉండనున్నాయి.