
పీఎం-కేర్స్ ఫండ్ అత్యంత పారదర్శకతతో నడుస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇది కుటుంబం నడిపే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వంటిది కాదని ఎద్దేవ చేశారు.
పీఎం-కేర్స్ నిధి సొమ్మును జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డీఆర్ఎఫ్)కు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ఈ వాఖ్యలు చేశారు.
పీఎం-కేర్స్ (ప్రధాన మంత్రి – అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయం, ఉపశమన నిధి) నిర్వహణలో పారదర్శకత చాలా స్పష్టంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ నిధికి విరాళాలు స్వచ్ఛందంగా వస్తున్నాయని పేర్కొన్నారు.
చట్టపరంగా, నిర్వహణ పరంగా ఈ నిధి అత్యంత పారదర్శకంగా ఉన్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వంపై కనీసం ఒక అవినీతి ఆరోపణ కూడా లేదని గుర్తు చేశారు. పీఎం-కేర్స్ అంటే చైనా నుంచి సొమ్ము స్వీకరించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వంటిది కాదని ధ్వజమెత్తారు.
పీఎం-కేర్స్ నిధి నుంచి ఇప్పటి వరకు రూ.3,100 కోట్లను కరోనా వైరస్‌తో పోరాడేందుకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధి సొమ్ముతో 50 వేల వెంటిలేటర్లను కోవిడ్ రోగులకు అందజేసినట్లు చెప్పారు. వీటి కోసం రూ.2,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
వ్యాక్సిన్ కనుగొనేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వలస కూలీలకు సహాయపడేందుకు రూ.1,000 కోట్లు మంజూరు చేశామన్నారు.
అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, కరోనా వైరస్ మహమ్మారి కోసం ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ నిధికి సేకరించిన సొమ్మును జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డీఆర్ఎఫ్)కు జమ చేయడం కానీ, బదిలీ చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది.
పీఎం కేర్స్‌కు నిధులు విరాళాల రూపంలో వచ్చినట్లు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కొత్త ఫండ్‌ను క్రియేట్ చేయడం వల్ల అది ఎన్డీఆర్ఎఫ్‌కు అవరోధంగా మారినట్లు పిటిషన్ వాదించారు. పీఎం కేర్స్ అనేది పబ్లిక్ చారిటీ ట్రస్టు లాంటిదని కేంద్ర హోంశాఖ కోర్టులో పేర్కొన్నది. ఎవరైనా దానికి స్వచ్ఛందంగా విరాళం ఇవ్వవచ్చు అని చెప్పింది.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!