పాక్ సరిహద్దులోతేజస్ యుద్ధ విమానాలు 

దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన (ఐఏఎఫ్) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాల 45 స్క్వాడ్రన్ దక్షిణ ఎయిర్ కమాండ్ పరిధిలోని కోయంబత్తూరు సమీపంలోని సులూరు వైమానిక స్థావరంలో ఉన్నది. కాగా, ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా తేజస్ స్క్వాడ్రన్‌ను ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దు వైమానిక స్థావరానికి తరలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 

దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించిన ప్రధాని మోదీ స్వదేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానం సత్తాను ప్రశంసించారు. ఎల్ఏసీ మార్క్1ఏ వర్షన్ యుద్ధ విమానాలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

మరోవైపు చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన గట్టి నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఐదు రాఫెల్ యుద్ధవిమానాలను కూడా రంగంలోకి దించింది. సరిహద్దు ప్రాంతాల్లో పగలు, రాత్రిపూట విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సర్వసన్నద్ధంగా ఉన్నది.