మహారాష్ట్ర ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి 

 బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి  అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు. 
 
సుప్రీంకోర్టు నిర్ణయం న్యాయవ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచిందని, కేసును డీల్ చేసే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు. సుశాంత్ రాజ్‌పుత్ కేసులో ఇప్పుడు న్యాయం జరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
సుప్రీం తీసుకున్న నిర్ణయాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాగతించారు. ఈ విషయంలో సుప్రీం ఈ తీర్పునిచ్చిందని, ఇక మరో మాటకు తావే లేదన్నారు. ఈ తీర్పుతో సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఏర్పడిందని ఆయన ప్రకటించారు. ఓ ఫిర్యాదు వచ్చిన తర్వాత దానిపై దర్యాప్తు చేయడం బిహార్ పోలీసుల విధి అని, కానీ ఈ విషయంలో ముంబై ఏమాత్రం సహకరించలేదని మండిపడ్డారు. 
 
సహకరించకపోగా పోలీసులతో వ్యవహరించిన తీరు ప్రపంచం మొత్తం చూసిందని ఆయన మరో మారు గుర్తు చేశారు. ఈ విషయంలో బిహార్ పోలీసులు చేసిన దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరైన చర్య అని సుప్రీం తీర్పు చూస్తే అర్థమవుతోందని నితీశ్ పేర్కొన్నారు.
 

కాగా, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర స్వాగతించారు. ఇప్పటి వరకూ మొద్దునిద్ర పోతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రోదనలు చేస్తోందని ఎద్దేవా చేశారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అధికారం కూడా కోల్పోతుందని జోస్యం చెప్పారు.

‘మొదట మహారాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయింది. ఆ తర్వాత సుశాంత్ ఫ్యామిలీపై సంజయ్ రౌత్ విమర్శలకు దిగారు. ఇప్పుడు ప్రభుత్వం రోదనలు చేస్తోంది. మిత్రులారా, త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టిందనే వార్త మనం వింటాం’ అని పాత్రా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.