25న జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్

తెలుగు రాష్ట్రాలమధ్య జలవివాదాల పరిష్కారానికి ఈ నెల 25న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. సోమవారం జలసౌధలోని జీఆర్‌ఎంబీ చైర్మన్‌ చాంబర్ లో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు పరమేశం, చంద్రశేఖర్‌ అయ్యర్, మెంబర్‌ సెక్రటరీలు హరికేశ్‌ మీనా, పీఎస్‌ కుఠియాల్ తో ఆయన భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, రెండు రాష్ట్రాల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను శ్రీరాం అడిగి తెలుసుకున్నారు. పోలవరం (పట్టిసీమ) ప్రాజెక్టు ద్వారా ఏపీ కృష్ణా బేసిన్ కు 80 టీఎంసీల గోదావరి నీటిని మళ్లిస్తోంది. బచావత్‌ అవార్డు ప్రకారం ఈ మేరకు కృష్ణా నీటిని ఎగువ రాష్ట్రాలు నాగార్జున సాగర్ కు ఎగువన వాడుకోవచ్చు.

ఈ 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ నీళ్ల కోసం తెలంగాణ డిమాండ్‌ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం ఏర్పాటు చేసిన బజాజ్‌ కమిటీ ఏం చేసింది? ఎలాంటి సిఫార్సులు చేసింది? కమిటీ ఎందుకు ముందుకు వెళ్లలేకపోయింది? అనే వివరాలను కృష్ణా బోర్డు చైర్మన్ ను అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నవివాదాలు, ఎప్పుడెప్పుడు ఏయే ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేశారు అనే వివరాలను కూడా వెదిరె శ్రీరాం సేకరించారు. మొదటి ‌ అపెక్స్ కౌన్సి ల్ భేటీలో చర్చకు వచ్చిన పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ స్కీంల వివరాలు తీసుకున్నారు.