వచ్చే నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని పలువురు మంత్రులతో జరిపిన సమావేశంలో నిర్ణయించారు.
20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా మంత్రులు, అధికారులను కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా సిద్ధం కావాలని చెప్పారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులను సిఎం ఆదేశించారు.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు
కూల్చివేతలపై రాహుల్ ఆగ్రహం… రేవంత్ ధిక్కారస్వరం!