3 రాజ‌ధానులు కేసు  నుంచి త‌ప్పుకున్న చీఫ్ జ‌స్టిస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌ని, ఆ ప్ర‌తిపాద‌న‌పై స్టే ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఆ పిటిష‌న్‌ను విచారించేందుకు చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నిరాక‌రించారు. ఆ కేసు విచార‌ణ నుంచి ఆయ‌న త‌ప్పుకున్నారు.

మూడు రాజ‌ధానుల విభ‌జ‌నపై స్టే ఇవ్వాల‌ని వేసిన పిటిష‌న్‌ను సీజే బోబ్డేతో పాటు జ‌స్టిస్ ఏఎస్ బొపన్నా, వీ రామ‌సుబ్ర‌మ‌ణ్యంతో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. అయితే విచార‌ణ స‌మ‌యంలో ఇదే కేసు విష‌యంలో హైకోర్టులో సీజే బోబ్డే కూతురు ఓ ప్రైవేటు పార్టీ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించిన‌ట్లు సీనియ‌ర్ న్యాయ‌వాది రంజిత్ కుమార్ తెలిపారు. 

ఈ కార‌ణం చేత ఆ కేసు విచార‌ణ నుంచి వైదొలుగుతున్న‌ట్లు సీజేఐ బోబ్డే తెలిపారు. బెంచ్ నుంచి సీజే త‌ప్పుకోవ‌డంతో ఆ కేసును మ‌ళ్లీ ఆగ‌స్టు 19వ తేదీన విచారించ‌నున్నారు. ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

క‌ర్నూల్‌లో హైకోర్టు, విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌రిపాల‌నా కార్యాల‌యాలు, అమ‌రావ‌తిలో అసెంబ్లీ ఏర్పాటుకు ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆ ప్ర‌తిపాద‌న‌కు జూలై 31వ తేదీన ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కూడా తెలిపారు. 

ఇలా ఉండగా, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్‌ 5 జోన్‌ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. హైకోర్ట్‌ విచారణ సరిగానే జరిగిందని సీజేఐ బబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులోనే కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్ట్‌ సూచించింది. 

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్‌(ఆర్‌-5)పై గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. విచారణ పూర్తయ్యేవరకూ గత ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్లు హైకోర్ట్‌ పేర్కొంది.