కరోనా యోధులకే తొలుత టీకా

శాస్త్రవేత్తలు కరోనా టీకా కోసం నిరంతరం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారని, వారి కృషి ఫలించి టీకా అందుబాటులోకి వస్తే కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికే తొలుత టీకా ఇస్తామని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే వెల్లడించారు. 
 కాగా, ప్రధాని మోదీ ప్రకటించిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను చౌబే స్వాగతించారు. కాగా, రష్యా టీకా ‘స్పుత్నిక్‌ వీ’ సమర్థతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)   గమనిస్తున్నట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. కరోనాపై పోరులో ప్రపచంచదేశాలతో పోల్చితే భారత్‌ మెరుగైన స్థానంలో ఉన్నదని భరోసా వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.  మరోవంక, దేశంలో క‌రోనా ఉధృతి ఏమాత్రం త‌గ్గడంలేదు. క‌రోనా బారిన‌ప‌డుతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. వ‌రుసగా ఐదో రోజూ 60 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.
గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 63,489 మంది క‌రోనా బారిన ప‌డ‌గా, 944 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 25,89,682కు చేరాయి. ఇందులో 6,77,444 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 18,62,258 మంది బాధితులు కోలుకున్నారు.
క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 49,980 మంది బాధితులు మ‌రణించార‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో గ‌డచిన 24 గంట‌ల్లో 57,381 మంది కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నార‌ని, కరోనా నుంచి ఒక్క‌ రోజులో అత్య‌ధికంగా కోలుకోవ‌డం ఇదే తొలిసార‌ని వెల్ల‌డించింది.
దేశంలో ఆగ‌స్టు 15 వ‌ర‌కు 2,93,09,703 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజు 7,46,608 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని వెల్ల‌డించింది.