జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి, సుపరిపాలన నూతన శకం 

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నూతన శకం ప్రారంభమైనదని, మొట్ట మొదటి సారిగా ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనలను చూడగలుగుతున్నారని జమ్మూ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ దీపాంకర్ సేన్ గుప్త చెప్పారు.

“ఆర్టికల్ 370 రద్దు ప్రభావం, అనుభవాలు” అంశంపై హైదరాబాద్ కు చెందిన సోషల్ కాజ్ జరిపిన వెబినార్ లో మాట్లాడుతూ ఆ రాష్ట్రాన్ని నూతనంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా పాలనా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సుపరిపాలన అందించ గలుగుతున్నదని తెలిపారు.

ఆర్టికల్ 370 ముసుగులో ఆ ప్రాంతం ఇప్పటి వరకు విచిత్రమైన రాజకీయ సంకీర్ణాలతో అసమర్ధ పాలనకు, అవినీతి పాలనకు కేంద్రంగా మారినదని విమర్శించారు. పైగా, రాజకీయ అస్థిరతకు నిలయంగా మారినదని పేర్కొన్నారు. పాలకులకు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ఆర్టికల్ 370 ఉపయోగ పడినట్లు తెలిపారు.

మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విస్తరింప చేయడంతో పాలనలో నూతన శకం  ప్రారంభమైనదని చెబుతూ  ఏడు దశాబ్దాలుగా పలు వర్గాలు అనుభవిస్తున్న మానసిక నూన్యతకు అంతం పలికిన్నట్లయినదని చెప్పారు. ముఖ్యంగా తూర్పు పాకిస్థాన్ నుండి వచ్చిన కాందిశీకులు, నాలుగవ తరగతి ఉద్యోగులు, కాశ్మీరీ మహిళలు వివక్షత నుండి బైట పడుతున్నారని దీపాంకర్ వివరించారు.

మొదటి సారిగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను పెద్ద ఎత్తున చేబడుతున్నారని ఆయన తెలిపారు. విద్యుత్, మౌలిక సదుపాయాలు లేక పోవడంతో ఇక్కడ ఎవ్వరు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని అన్నారు. గత ఏడాది ఆగష్టు 5 తర్వాత వచ్చిన మార్పులను, అంతకు ముందున్న కాలం నాటి పరిస్థితులతో పోల్చి చూడాలని సూచించారు.

దీర్ఘకాలం పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరపక  పోవడంతో గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న నాయకత్వ సూన్యతను ఇప్పుడు భర్తీ చేసారని, నగర పాలక సంస్థలలో సహితం పెద్ద ఎత్తున క్రియాశీలత కనిపిస్తున్నదని వివరించారు.

అయితే ప్రభుత్వం తాను చేబడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలపలేక పోతున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్ ఛాంబర్ అఫ్ కామర్స్, పౌర సమాజ సంస్థలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు.

ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ యువతకు అపారమైన అవకాశాలు తీసుకు వచ్చేందుకు దోహదపడుతున్నదని కాశ్మీర్ యూనివర్సిటీ కి చెందిన మానవహక్కుల కార్యకర్త తౌసీఫ్ రసూల్ ధర్ తెలిపారు. కాశ్మీరీ యువత అభివృద్ధిని, ఉద్యోగాలను కోరుకొంటున్నారని చెప్పారు. ఈ ప్రాంతాన్ని జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి ఆర్టికల్ 370 రద్దు దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్ భూభాగంలో సగం భాగం వరకు 1 లక్ష కిమీ కు పైగా విదేశాల ఆక్రమణలో ఉన్న లడఖ్ ప్రాంతం గురించి ఇప్పటి వరకు ఎవ్వరు పట్టించుకోవడం లేదని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ కి చెందిన ఆయుషి కేట్కర్ విచారం వ్యక్తం చేశారు. ఆర్టికల్  రద్దుతో కాశ్మీరీ మహిళలకు విముక్తి కలిగినదని ఆమె పేర్కొన్నారు. చాలామంది కాశ్మీర్ మహిళలు ఇతర ప్రాంతాల యువకులను వివాహం చేసుకొని తమ  ఉద్యోగాలు కోల్పోయారని చెబుతూ ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించారు.

20 లక్షల మంది తూర్పు పాకిస్థాన్ కాందిశీకులు ఏడు దశాబ్దాలుగా పౌరసత్వ హక్కులు ఇవ్వకుండా పాకిస్థానీ పౌరులకు మాత్రం పౌరసత్వంతో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తూ వచ్చారని ఆమె విమర్శించారు.

పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం క్రియాశీలంగా తగు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. మొదటగా, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఆ ప్రాంతంకు రిజర్వు 24 సీట్లను భర్తీ చేయాలనీ ఆమె  సూచించారు.గత ఏడాది కాలంలో రూ 1,300 కోట్ల వ్యయం కాగల మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించారని ఆమె చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ ప్రజలు మొదటి సారిగా జవాబుదారీతనం గల ప్రభుత్వాన్ని చూస్తున్నారని యూత్ ఫర్ పనున్ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి రాహుల్ రాజదాద్ తెలిపారు. గత 25 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కానీ ప్రాంతం మన దేశంలో ఇదొక్కటే అని స్పష్టం చేశారు.

25 ఏళ్ళ క్రితం కాశ్మీరీ పండిట్ లను దారుణంగా కాశ్మీరీ లోయ నుండి గెంటివేయడం అమానుషమైన మారణకాండ అని అంటూ ఇప్పటి వరకు అందుకు బాధ్యులైన వారిపై ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వెంటనే తాము తిరిగి గౌరవంగా, సమాన హక్కులతో తిరిగి అక్కడకు వెళ్లే పరిస్థితులు కల్పించాలని, ఈ మారణకాండకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.