పార్లమెంట్‌ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

పార్లమెంట్‌ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలలో బడ్జెట్‌ సమావేశాలను అర్ధాంతంగా ముగించారు. అప్పటి నుంచి ఆరు నెలల్లోపు మరో సమావేశాలను కచ్చితంగా నిర్వహించాలన్న నిబంధనతో సెప్టెంబర్‌ 26వ తేదీ లోపు వర్షకాల సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలి. 

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల కోసం మొదటిసారిగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తారు. ఇవి ముగిసిన తర్వాత రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు హాజరయ్యేవారంతా భౌతిక దూరం పాటించేందుకు లోక్‌సభ, రాజ్యసభలోని ఛాంబర్లు, గ్యాలరీలను ఉపయోగించుకోబోతున్నారు. 

చాంబర్స్‌లో నాలుగు పెద్ద స్క్రీన్లను, గ్యాలరీల్లో ఆరు చిన్న స్క్రీన్లను పెట్టబోతున్నారు. వీటి ద్వారా రియల్‌టైమ్‌లో పార్లమెంట్‌ సమావేశాలను లైవ్‌లో చూపిస్తారు. రాజ్యసభలోని ఎసి యూనిట్‌ క్రిములను, వైరస్‌లను చంపేందుకు అల్ట్రావయెలెట్‌ ఇరాడియేషన్‌ పద్దతిని కూడా పెట్టపోతున్నారు. రాజ్యసభ చాంబర్‌, గ్యాలరీల్లో వివిధ పార్టీలకు వాటి సంఖ్య ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

మిగిలిన వారికి లోక్‌సభలోని రెండు బ్లాక్స్‌లో ఉన్న చాంబర్స్‌లో సీట్లు కేటాయిస్తారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడుకి రాజ్యసభ ఛాంబర్‌లో సీట్లు ఏర్పాటు చేస్తారు. మాజీ ప్రధానులు డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, హెచ్‌డి దేవేగౌడలకు కూడా ఇక్కడే సీట్లు ఏర్పాటు చేస్తారు. రెండు సభలను రోజుకు నాలుగు గంటల పాటు మాత్రమే నిర్వహిస్తారు.