ఏపీలో తాజాగా ప్రొద్దుటూరు ఎమ్యెల్యేకు కరోనా 

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్‌కి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నారు. 

కాగా, గత కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారు స్వీయ నిర్బంధంలో ఉండాలని శివప్రసాద్ సూచించారు. ఎపిలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సిఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అంబటి రాంబాబు, కరణం బలరాం కరోనా బారిన పడ్డారు. 

వీరితో పాటు బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్. వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు కరోనా సోకింది.  వీరిలో  కొంతమంది కోలుకోగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇలా ఉండగా,  ఏపీలో గడచిన 24 గంటల్లో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. దీంతో.. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 87 మంది మృతి చెందడంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,562కి చేరింది.

అయితే ఏపీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులతో పోల్చుకుంటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం