ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి 

ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో ఈ రెండు జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయానికి నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, నీటి మట్టం మరింత పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి మట్టం మరో 5 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.
 
వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో అక్కడి స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. ఎగువ ప్రాంతాలైన ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతోనే భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తోందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.

శబరి, గోదావరి నదుల వరద ప్రవాహం పెరగడంతో… చట్టి నుంచి కుంట వెళ్లే రోడ్డు, చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి నీట మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
 
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి 10.87 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టాలు పెరగడంతో నిర్వాసిత గ్రామాలైన దేవీపట్నం, పోచమ్మగండి, పూడిపల్లి, తొయ్యూరుతోపాటు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరి, పత్తి పంటలు నీటమునిగాయి. 
 
ఊళ్లు మునిగిపోతున్నా ఎగువ ప్రాంతాలకు, కొండలపైకి ఎక్కి తలదాచుకుంటున్నారే తప్ప, కరోనా భయంతో పునరావాస కేంద్రాలకు ప్రజలు వెళ్లడం లేదు. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాల ప్రజలు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం రెండు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. 
 
పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ఎగువన వరద నీరు పొంగిపొర్లుతోంది. స్పిల్‌వే వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలవరం మండలంలో 19 ఏజెన్సీ గ్రామాలకు, వేలేరుపాడు మండలంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతితో గోదావరి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. శనివారం ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు రాగా, బ్యారేజీకున్న 70 గేట్లు ఎత్తి 54 వేల క్యూసెక్కులను సముద్రంలోకి, కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు 11 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వర్షాలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నూజివీడు, పామర్రు, గుడివాడ బస్టాండ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. 
 
గుంటూరు జిల్లా నేలపాడు, ఐతానగర్‌ ప్రాంతాల్లో వరి నారు మడులు నీట మునిగాయి. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 868.40 అడుగులకు చేరింది. నీటి నిలువ సామర్థ్యం 215 టిఎంసిలకుగాను ప్రస్తుతం 136.2810 టిఎంసిలుగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 40,259 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుండి హంద్రీ-నీవాకు 1688, పోతిరెడ్డిపాడు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 
 
అల్పపీడన ప్రభావంతో విశాఖ ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలంలో 83.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలోని గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.