అవినీతిలో సిఎంఓ ప్రమేయం 

తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం లో ఏ చిన్న పని జరగాలన్న అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని బిజెపి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. అందుకు ఉదాహరణే మేడ్చ‌ల్ జిల్లా కీసర మండ‌ల‌ రెవిన్యూ అధికారులు ఏసీబీ కి పట్టుపడడమ‌ని ఆరోపించారు. 

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కొంతమంది ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ సర్కారు భూములను ప్రైవేటు సంస్థలకు కట్ట బెడుతున్నారని ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. ఏసీబీ కేసుల్లో విచారణ సరిగా జరపడం లేదని దుయ్యబట్టారు. 

ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే అవినీతి లో భాగ‌స్వాముల‌వుతున్నారని ఆరోపించారు. రెవిన్యూ ఉద్యోగులు లక్షలు, కోట్లలో లంచం తీసుకుంటున్నారంటే అందులో సీఎంవో అధికారులకు సంబంధం ఉందని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్ లోని అధికారుల ఆదేశాల మేరకే ఎమ్మార్ఓలకు పోస్టింగ్ లు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. అవినీతిలో సీఎంవో అధికారులకు,  టి ఆర్ ఎస్ లోని నాయకులు పాత్ర ఉందని ప్రభాకర్ ఆరోపించారు. 

ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అవినీతి పై జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై త్వరలోనే గవర్నర్ ను కలుస్తామ‌ని చెప్పారు.