తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణాలో రాగల మూడు రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ రోజు, రేపు కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో వరదనీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 513.41 అడుగులుగా ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో 513.64 అడుగుల నీరు ఉంది. ఈ క్రమంలో అలుగులు, తూముల ద్వారా వరద నీటిని వ‌దిలేస్తున్నారు. 

రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.   

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. 5 గేట్లు రెండున్నర ఫీట్లు ఎత్తి 16,125 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు, ప్రస్తుతం 643.8 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలు, 4.067 టీఎంసీలున్నాయని అధికారులు తెలిపారు.