ఆర్బీఐ డివిడెండ్ రూ.57,128 కోట్లు

ఆర్బీఐ డివిడెండ్ రూ.57,128 కోట్లు

 రిజర్వు బ్యాంకు ఈసారి డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్లు చెల్లించనున్నది. 2019-20 అకౌంటింగ్‌ సంవత్సరానికి సంబంధించి ఈ చెల్లింపులు జరుపనున్నది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాతదాస్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం ఈ నిధుల బదిలీకి ఆమోదముద్ర వేసింది. 

కరోనా సంక్షోభం వల్ల ఆదాయం భారీగా పడిపోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక అవసరాలను తీర్చుకొనేందుకు ఈ నిధులు కొంత మేరకు ఉపయోగపడనున్నాయి. కానీ భారీగా పెరిగిన ఆదాయ లోటును పూడ్చుకోవడంలో కేంద్రానికి ఈ నిధులు ఏమాత్రం చాలకపోవచ్చు. 

2018-19 అకౌంటింగ్‌ సంవత్సరానికి రిజర్వు బ్యాంకు రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇందులో రూ.1.23 లక్షల కోట్ల డివిడెండ్‌, మరో రూ. 52.637 కోట్ల మిగులు కేటాయింపులు ఉన్నాయి. కంటింజెన్సీ రిస్క్‌ బఫర్‌ స్థాయి లేదా వాస్తవిక ఈక్విటీ నిర్వహణ పేరిట కొత్త ఈసీఎఫ్‌ (ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌) అమల్లోకి రావడమే ఇందుకు కారణం. 

ఇకపై వాస్తవిక ఈక్విటీ స్థాయిని 5.5 శాతానికి పరిమితం చేయాలని బోర్డు సమావేశం నిర్ణయించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని కమిటీ సిఫారసు అమల్లోకి రాకముందు వాస్తవిక ఈక్విటీ స్థాయి 6.8 శాతం వద్ద ఉండేది.