
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని, తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్నారని సైన్యానికి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి గురువారం ప్రకటించింది. వెంటిలేటర్‌పైన ఉన్న ఆయనకు వైద్య చికిత్సలు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు.
ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స జరిగింది. అంతకుముందే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గురువారం కూడా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని, ఆయన డీప్ కోమాలో ఉన్నారని, ఆయన శరీరంలోని కీలక అంగాలు పనిచేస్తున్నాయని, ఆయన వెంటిలేటర్ సాయంతో కొనసాగుతున్నారని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇదిలా ఉండగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో సాగుతున్న వదంతులను ఆయన కుమారుడు, మాజీ ఎంపి అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ‘నా తండ్రి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని అభిజిత్ స్పష్టం చేశారు.
కొందరు ప్రముఖ జర్నలిస్టులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు, వదంతులు భారతదేశంలోని మీడియా తప్పుడు వార్తల కార్ఖానాగా మారిపోయిందని స్పష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై స్పందిస్తూ ఆస్పత్రి నుంచి తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం తన ఫోన్‌ను అందుబాటులో ఉంచానని, అందుకే మీడియాలో వచ్చే వదంతులను చూసి తనకు ఫోన్ చేయవద్దని అర్థిస్తూ ట్వీట్ చేశారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!