నిజాయతీకి పురస్కారం ‘ట్యాక్స్‌పేయర్‌ చార్టర్‌’ 

దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు ఓ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారు. ‘ట్యాక్స్‌పేయర్‌ చార్టర్‌’ పేరిట దీన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సార్వత్రిక బడ్జెట్‌లోనే ప్రకటించింది. 
 
చట్టబద్ధ హోదాను కలిగి ఉండే ఈ ప్లాట్‌ఫామ్  ఆదాయ పన్ను (ఐటీ) విభాగం సేవలను త్వరితగతిన పొందేలా ప్రజలకు సాధికారత కల్పిస్తుంది.
పన్నుల చెల్లింపులో పారదర్శకతను పెంపొందించడంతోపాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించేందుకు తీసుకొస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రత్యక్ష పన్ను సంస్కరణలను మరింత ముందుకు నడిపేందుకు దోహదం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యక్ష పన్నుల్లో పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు నెలకొల్పేవారికి ఈ రేట్లను 15 శాతానికి కుదించడంతోపాటు డివిడెండ్‌ పంపిణీ పన్నును రద్దు చేసింది.
పన్ను రేట్లను తగ్గించడం, ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళతరం చేయడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని, ఐటీ విభాగ పనితీరును, పారదర్శకతను పెంపొందించేందుకు సీబీడీటీ ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ పేర్కొన్నది.