ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకునే దమ్ములేదా?

కరోనా చికిత్స పేరుతో రోగుల నుంచి లక్షల్లో బిల్లులు గుంజుతున్న ప్రైవేట్ హాస్పిటళ్ళపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
డెక్కన్, విరించి లాంటి హాస్పిటళ్లపై చర్య తీసుకోని మిగతా హాస్పిటళ్లజోలికి ఎందుకు వెళ్ళటం లేదో చెప్పాలని ఆమె నిలదీసేరు. సోమవారం సోమాజి గూడలోని ఓ ప్రముఖ హాస్పిటల్ ముందు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 
 
ఈ సందర్భంగా గీతామూర్తి మాట్లాడుతూ డీఎంహెచ్ఓ స్థాయి అధికారి కుటుంబాన్ని కూడా లక్షల్లో బిల్లు కోసం హాస్పిటల్ యాజమాన్యం వేధించిందని, అయినా సరైన చికిత్స అందక ఆయన చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రజల రక్తం తాగుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గీతా మూర్తి డిమాండ్ చేశారు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగిన మహిళా మోర్చా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.