ఏపీలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం 

 
ఆంధ్ర ప్రదేశ్ లో 2024 ఎన్నికలలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేబడుతూ 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 
 ఏపీ రాజకీయాల్లో బీజేపీ వాణి వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అవసరం ఉందని, ఏపీ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయని ధ్వజమెత్తుతూ ఏపీ అభివృద్ధికి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని భరోసా ఇచ్చారు.
 
రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని స్పష్టం చేస్తూ ప్రస్తుతం ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర, దేశాభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల జీవనాడి అని.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీది ఎప్పుడూ ఒకటే మాట, ఒకటే సిద్ధాంతమని పేర్కొంటూ . చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
 ఇతర పార్టీలు తెలంగాణలో విభజన వాదం,  ఏపీలో సమైక్యవాదం పేరుతో ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ ఎమర్జెన్సీ ప్రకటించి..15 రోజుల పాటు దానిపై దృష్టి పెట్టాలని సోము వీర్రాజు సూచించారు.
 
మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలదేశాభివృద్ధి ను అమలుని చెబుతూ సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమేనని తెలిపారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. 
పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యమని చెబుతూ కేంద్రం అన్ని గ్రామాలకు ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చిందని, జన్‌ధన్‌ ఖాతాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని వివరించారు. 
 
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2018 మే 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తనను నియమించారని, పది మాసాలే గడువు ఉన్నా కమిటీలు వేసుకుని ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. మళ్లీ సంస్థాగత ఎన్నికలు రావడంతో.. బూత్ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. 
 
ఇప్పుడు కొత్త అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యత తీసుకున్నారని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానని  సంతృప్తి వ్యక్తం చేశారు. తన చర్యల వల్ల కొంతమంది కి కష్టం, నష్టం కలిగించినా… అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. 
 
పార్టీ కోసం పని చేసే క్రమంలో బీజేపీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కొత్త అధ్యక్షులు సోము వీర్రాజుకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. 
సంస్థాగత మార్పులలో భాగంగా సోము వీర్రాజు ఏపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున కొంత మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతూ యూట్యూబ్ లింక్ ద్వారా లక్షల మంది అభిమానులు వీక్షించే ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు.