మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు కోవిడ్-19 టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందని ప్రణబ్ తెలిపారు.
 
 గత వారం రోజుల నుంచి తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని, అలాగే కోవిడ్-19 టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.  
 
ఇలా ఉండగా, సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలను దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54,859 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 15,35,744కి చేరింది. 
 
దేశంలో కరోనా బారిన పడిన వారిలో 70 శాతం మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 6,34,945 యాక్టిక్ కేసులతో పోల్చితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9 లక్షలు ఎక్కువని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ప్రస్తుతం 28.66 శాతం పాటిజివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
 
కరోనా మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతున్నదని, ప్రస్తుతం ఇది 2 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.  ఒకవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఊరట నిస్తున్నా మరోవైపు దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా కేసులు, 1,007 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు, మ‌ర‌ణాల సంఖ్య 44,386కు చేరింది. దేశ‌వ్యాప్తంగా కొత్తగా న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతం ప‌ది రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరోవంక, మహరాష్ట్రలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికంగా కరోనా కేసులు నమోదుకావడమే ఇందుకు కారణమని, వాటిని అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పింది. పూణే, ముంబై, సోలాపూర్, మాలేగావ్, ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్‌గావ్, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ పొడిగించనున్నట్లు పేర్కొంది