కరొనాను ఎదుర్కోవడంలో కేసీఆర్ నేరమయ నిర్లక్ష్యం 

కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆరోపించారు. కోవిడ్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టులు సైతం నిలదీయడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ను గద్దెదింపి బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని అఆయన పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణలోని 9 జిల్లాల్లోని బిజెపి కార్యాలయాలకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

కరోనాపై పోరాటంలో మోదీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని నడ్డా ధ్వజమెత్తారు. ఆక్సిజన్ అందక ఒక జర్నలిస్టు మృతి చెందడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించేందుకు ‘ఆయుష్మాన్ భారత్’ ప్రవేశపెడితే కేసీఆర్ సర్కార్ మాత్రం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని చెబుతూ ఆరేళ్ల క్రితం 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు 50వేల ఇళ్లు కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాలన్నారని, అయితే ఎవరికీ ఉద్యోగాలు రాలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ  85వేల కోట్లకు పెంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు మోదీకి మద్దతుగా ఉన్నారని, అందుకే గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిపించారని నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో మోదీ తరహా పాలన కావాలని కోరుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని భరోసా వ్యక్తం చేశారు.

రామజన్మభూమి సహా మనం సాధించిన చారిత్రాత్మక విజయాల వెనక కార్యకర్తలు కృషి ఉందని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికే దారి చూపెడుతున్నారని నడ్డా కొనియాడారు. అన్ని దేశాల్లో ప్రభుత్వాలు కోవిడ్ పై పోరాడుతుంటే భారత్ లో మాత్రం ప్రభుత్వంతో పాటు సమాజమూ పోరాడేలా మోదీ స్ఫూర్తి నింపారని తెలిపారు.

డబ్ల్యూహెచ్ఓ, యూఎన్ లాంటి సంస్థలు కూడా భారత్ ను చూసి నేర్చుకోవాలని కితాబిచ్చాయని గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటికి దేశంలో ఒక్క కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి లేదని, ఇప్పుడు 1500 ఆస్పత్రులు ఉన్నాయని చెప్పారు.

అదే విధంగా 44వేల పడకల నుంచి 12.5 లక్షలపడకలకు, సున్నా నుంచి 1.60 లక్షల ఆక్సిజన్ పడకలకు, 42వేల ఐసీయూ పడకలకు మన సామర్థ్యం పెరిగిందని వివైర్నచారు. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ 5లక్షల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నామని చెప్పారు.

‘జాన్ హై తో జహాన్ హై’ అన్న నినాదంతో ఆరోగ్యంతో పాటు ఆర్థికాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టారని నడ్డా పేర్కొన్నారు. రూ.1.70 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించడం ద్వారా దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు అందించారని,  వీటిని ఇప్పుడు నవంబర్ వరకు పొడిగించారని గుర్తు చేశారు. 

పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ, మహిళల జన్ ధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున రూ.1500 జమ, దివ్యాంగులు, వితంతువులు, సీనియర్ సిటిజన్లకు రూ.1000 స్టైఫండ్ జమ చేశారని తెలిపారు.

కరోనా ఆపదను అవకాశంగా మలచుకోవాలని పిలుపునిస్తూ ప్రధాని మోదీ రూ 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించారని నడ్డా గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు, వ్యవసాయాభివృద్ధికిరూ 1 లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారని వెల్లడించారు. పూచీకత్తు లేకుండా వీధి వ్యాపారులకు రుణాలు, కిసాన్ క్రిడెట్ కార్డులు వంటివి ఎన్నో ప్రజలకు మేలు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

బిజెపి కార్యకర్తలకు ‘సేవా హీ సంఘటన్’… అంటే సేవే సంస్థ అని పేర్కొంటూ అందుకే ప్రధాని స్ఫూర్తితో కరోనా కాలంలో ఫీడ్ ది నీడీ కింద 24 కోట్ల ఆహార ప్యాకెట్లు దేశవ్యాప్తంగా అందజేసామని చెప్పారు. తెలంగాణలోనూ 24 లక్షల ఆహార ప్యాకెట్లు, 16 లక్షల మోదీ కిట్లు, 15 లక్షల మాస్కులు, 6800 పీపీఈ కిట్లు బిజెపి కార్యకర్తలు పంపిణీ చేశారని వివరించారు.

తెలంగాణ కార్యకర్తలు వలస కార్మికులకు భోజనం, రవాణా సదుపాయాలు సైతం కల్పించారని, అంతేకాకుండా విదేశాల్లో ఉన్నవారి తల్లితండ్రుల బాగోగులు చూసుకున్నారని, వారికి సమయానికి మందులు అందించారని నడ్డా కొనియాడారు. సంపర్క అభియాన్ లో భాగంగా డిజిటల్ మాధ్యమంలో 30 లక్షల మందికి బిజెపి తెలంగాణ చేరువైందని చెప్పారు. ఇంకా ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరెంతో మందికి పార్టీ చేరువైందని తెలిపారు.

నడ్డా గారితో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు దిల్లీ నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. భూమిపూజ జరుగుతోన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.