
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయ–మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తోంది. కరోనా కారణంగా ఏర్పడ్డ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా దీనిని కేటాయించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఈ నిధిని ప్రారంభిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఆరోవిడత పీఎం–కిసాన్ యోజన కిస్తీల కోసం రూ.17 వేల కోట్లు కూడా విడుదల చేస్తారు. ఫలితంగా 8.5కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గత నెలే ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజిలో ఇదొక భాగం. పదేళ్ల పాటు ఈ నిధుల ద్వారా రుణాలు ఇస్తారు.
వ్యవసాయరంగ పరిశ్రమలు, స్టార్టప్లు, సామూహిక సాగు చేసే రైతులకూ ఆర్థికసాయం చేస్తారు. ఈ రుణాలకు వడ్డీ మాఫీ ఉంటుంది. రాయితీలూ వర్తిస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను రాబట్టడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్లు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలను ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలకు, రైతు సంఘాలకు, రైతు ఉత్పత్తుల సంఘాలకు, వ్యవసాయ పరిశ్రమలకు, స్టార్టప్లకు, అగ్రిటెక్ కంపెనీలకు రుణాలు ఇస్తాయి. రూ.లక్ష కోట్లలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తారు.
మొత్తం నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తారు. రాబోయే మూడేళ్లలో రూ.30 వేల కోట్ల చొప్పున రుణాలు మంజూరు చేస్తారు. అన్ని రుణాలపై మూడు శాతం వడ్డీ మాఫీ ఉంటుంది. గరిష్ట పరిమితి రూ.రెండు కోట్లు. ఏడేళ్ల పాటు మాఫీ కొనసాగుతుంది.
ఈ నిధి నిర్వహణ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇందు కోసం ఆన్లైన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)ను ఉపయోగిస్తామని వెల్లడించారు. అర్హులైన అన్ని కంపెనీలు, రైతు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తాయి, వడ్డీ మాఫీ ఎంత ఉటుంది, క్రెడిట్ గ్యారంటీ అందుబాటు, అందజేయాల్సిన డాక్యుమెంట్లు తదితర వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి.
రుణ దరఖాస్తులను ఆన్లైన్లో తొందరగా ప్రాసెస్ చేస్తారని ఈ మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యవసాయరంగ పరిశ్రమలకు, రైతు సంఘాలకు రుణాలు ఇస్తే సాగు విస్తీర్ణం, ఈ రంగంలో పరిశ్రమలు పెరుగుతాయని పేర్కొంది. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు వస్తా యని వివరించింది.
‘‘గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సదుపాయాలతో రైతులు తమ పంటలకు మంచి ధర పలికే వరకు వేచిచూసే అవకాశం దొరుకుతుంది. ఆహార వృధా తగ్గుతుంది ”అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరించారు.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
మరోసారి అత్యంత ధనవంతుడిగా అంబానీ