వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర అధికారులు, రైతులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు.
ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది.
2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని ప్రభుత్వం తెలిపింది.
కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు రూ 2,000 చొప్పున రూ.17 వేల కోట్లు నేడు వారి బ్యాంకు ఖాతాలలో జమచేయనున్నారు.
More Stories
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్యం తోఫా’
జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం