శ్రీలంకలో రాజపక్సకు తిరుగులేని విజయం 

శక్తిమంతమైన రాజపక్స కుటుంబం నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ (ఎస్ఎల్‌పీపీ) పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దీంతో దేశంలో తమ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు వారికి అవకాశం కలిగింది. 
 
 శ్రీలంక ఎన్నికల కమిషన్ ఈ నెల 5న జరిగిన ఎన్నికల ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఎన్నికల ఫలితాల ప్రకారం,  ప్రధాన మంత్రి మహీంద రాజపక్స నేతృత్వంలోని ఎస్ఎల్‌పీపీ పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల ఆధిక్యత సాధించింది.
 
 225 మంది సభ్యులు ఉండే పార్లమెంటులో ఈ పార్టీకి 145 స్థానాలు లభించాయి. మిత్ర పక్షాలు 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఈ పార్టీకి కేవలం ఒక స్థానం మాత్రమే దక్కింది. అది కూడా దేశవ్యాప్తంగా పోలైన క్యుములేటివ్ ఓట్ల వల్ల లభించింది.
స్వయంగా విక్రమసింఘే కూడా పరాజయం చవి చూశారు. దేశవ్యాప్తంగా ఈ పార్టీకి 2,49,435 ఓట్లు మాత్రమే లభించాయి. ప్రధాన తమిళ పార్టీ టీఎన్ఏకు గతం కన్నా ఆరు స్థానాలు తగ్గిపోయాయి. గతంలో ఈ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 10 స్థానాలతో సరిపెట్టుకుంది. తమిళుల ప్రాబల్యంగల 3 జిల్లాల్లో విజయం సాధించింది. 

మహీంద రాజపక్స ట్విటర్ ద్వారా శ్రీలంక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎల్‌పీపీపై నమ్మకం ప్రదర్శించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ పదవీ కాలంలో ప్రజలు నిరుత్సాహానికి గురికాబోరని హామీ ఇచ్చారు. 

తనపైనా, దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపైనా, పోడుజన పార్టీపైనా నమ్మకం పెట్టుకుని, ఓట్లు వేసి,  గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘సౌభాగ్య దక్కమ’ ఎన్నికల ప్రణాళికకు పెద్ద ఎత్తున ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఎస్ఎల్‌పీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మహీంద రాజపక్సను అభినందించారు. భారత్-శ్రీలంక కలిసికట్టుగా అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ద్వైపాక్షిక సహకారం కోసం కృషి చేస్తూ, ఇరు దేశాల మధ్య సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దీనిపై మహీంద రాజపక్స స్పందిస్తూ, తనకు ఫోన్ చేసి, అభినందించినందుకు  మోదీకి ధన్యవాదాలు చెప్పారు. భారత దేశం, శ్రీలంక మిత్ర దేశాలని చెప్తూ, శ్రీలంక ప్రజల బలమైన మద్దతుతో, ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారాన్ని మరింత పెంచేందుకు కలిసి పని చేయాలని తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు.

 ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. మహీంద రాజపక్స 2005 నుంచి 2015 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పని చేశారు.