తొలి కిసాన్‌ రైలును ప్రారంభించిన తోమర్‌, గోయల్‌

రైతుల ప్రయోజనం కోసం దేశంలో ప్రవేశపెట్టిన తొలి కిసాన్‌ రైలును కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌ వరకు నడిచే తొలి కిసాన్‌ రైలుకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పచ్చజెండా ఊపారు. 

త్వరగా పాడయ్యే అవకాశమన్న పాలు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను చాలా వేగంగా, తక్కువ వ్యయంతో రవాణా చేసే అవకాశం రైతులకు కలిగిందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సందర్భంగా తెలిపారు. రైతులు తాము పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే హక్కుకు ఈ కిసాన్‌ రైలు దోహదపడుతుందని చెప్పారు.

 రైతులు ఏండ్లుగా పడుతున్న కష్టాల నుంచి గట్టెక్కి స్వావలంబన సాధించాలని, సుసంపన్నం కావాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ అంగడి, మహారాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ శాఖ మంత్రి ఛగన్‌ భుజబల్‌, మాజీ సీఎం దేవేండ్ర ఫడ్నవిస్‌ ఈ వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శీతల వ్యాగన్లు ఉండే ఈ కిసాన్‌ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవ్లాలిలో బయలుదేరి శనివారం సాయంత్రం 6.45కి దానాపూర్‌ చేరుతుంది. దానాపూర్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సోమవారం సాయంత్రం 7.45 గంటలకు దేవ్లాలి చేరుతుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న 1,519 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల్లో పూర్తి చేస్తుంది.

త్వరగా పాడైపోయే పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కిసాన్‌ రైళ్లను రైల్వే శాఖ నడపనున్నది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న లక్ష్యం మేరకు కిసాన్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.