పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుంది 

కొత్త విద్యా విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని, విద్య నేర్చుకోవాలన్న కోరిక బాగా పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రకటించారు. నూతన విద్యా విధానంపై శుక్రవారం ఆయన ప్రత్యేకంగా వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడుతూ విస్తృతమైన అధ్యయనం తర్వాతే కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ విద్యా విధానంపై ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత ప్రయోజనమని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని, దీంతో దేశానికి విస్తృత ప్రయోజనాలు చేకూర్చుతాయని తెలిపారు. 

సుమారు మూడు నుంచి నాలుగు ఏళ్ల విస్తృత చ‌ర్చ‌ల త‌ర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.  దీని కోసం ల‌క్ష‌ల సంఖ్య‌లో స‌ల‌హాలు తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  

చిన్నారులు, యువతలో సృజనాత్మకత పెంచేలా ఈ విద్యా విధానం ఉందని, పిల్లల్లో నిశిత పరిశీలన, ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా ఉందని ఆయన ప్రకటించారు.  పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం ఎంతో ఉపకరిస్తుందని, నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చామని వివరించారు.

ఒకే దేశం – ఒకే విద్యా విధానం ఉండాలని, రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 21 వ శతాబ్దంలో విద్యార్థులు నైపుణ్యాలపై ఈ విధానం దృష్టి పెడుతుందని పేర్కొంటూ కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

కొత్త విద్యా విధానంపై ఎవ్వరికీ అపోహలుండాల్సిన అవసరం లేదని చెబుతూ భవిష్యత్ లక్ష్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

జాతీయ విద్యా విధానం ప్ర‌క‌టించిన త‌ర్వాత ఎవ‌రు కూడా దాన్ని వ్య‌తిరేకించ‌లేద‌ని ప్రధాని గుర్తు చేశారు.  కొత్త విధానం వ‌ల్ల అంద‌రూ సంతోష‌ప‌డిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌తి దేశం త‌మ విద్యా వ్య‌వ‌స్థ‌తోనే జాతీయ విలువ‌ల‌ను సంఘ‌టితం చేస్తుందని తెలిపారు.  జాతీయ ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా విద్యా వ్య‌వ‌స్థ‌ను సంస్క‌రిస్తుంటాయ‌ని భరోసా ఇచ్చారు.

 నాణ్య‌మైన విద్య కోసం ప‌నిచేయాలని కోరుతూ అనేక విద్యా సంస్థ‌ల‌కు అటాన‌మీ ఇచ్చార‌ని, ఇప్పుడు ఆ ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం అవుతుందని వెల్లడించారు. కొత్త విధానంలో ఉపాధ్యాయుల గౌరవానికి కూడా స్థానం క‌ల్పించిన‌ట్లు ప్రధాని చెప్పారు. ఉపాధ్యాయులుకూడా త‌మ నైపుణ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాల‌ని సూచించారు.

ఇన్నాళ్లూ మ‌న విద్యా వ్య‌వస్థ ఏం ఆలోచించాల‌న్న దానిపైనే దృష్టి పెట్టిందని, ఇక ఇప్పుడు కొత్త విద్యా విధానం ఎలా ఆలోచించాల‌న్న అంశాన్ని ఫోక‌స్ చేస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.  ఈ రోజుల్లో స‌మాచారానికి కొద‌వ లేద‌ని, అయితే పిల్ల‌ల‌కు విశ్లేష‌ణాత్మ‌క వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌డ‌మే కొత్త విద్యా విధాన ల‌క్ష్య‌మని చెప్పారు.