కార్పొరేటు ఆస్పత్రుల నిలువు దోపిడీ  

ఆంధ్ర ప్రదేశ్ లో  రోజు రోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుండటం, ప్రభుత్వాస్పత్రుల్లో సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రుల నిలువు దోపిడీకి అడ్డులేకుండా పోతున్నది. రోగుల అభద్రతా భావాన్ని క్యాస్‌ చేసుకుంటున్న ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 
 
ఫలితంగా కరోనా రోగులకు అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులూ తప్పడం లేదు. ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి సర్కారు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ఈ దోపిడీకి తెరలేపారు. ఆస్పత్రి స్థాయిని బట్టి ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో రకంగా చార్జ్‌ చేస్తున్నారు.
 
బందరు రోడ్డు సమీపంలోని ఓ కార్పొరేటు ఆస్పత్రిలో ఒక్కో పేషెంట్‌కు రోజుకు కనీసం రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకూ చార్జ్‌ చేస్తున్నారు. బీసెంట్‌ రోడ్డు సమీపంలో ఉన్న మరో కార్పొరేటు ఆస్పత్రిలో రోజుకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. 
 
చిన్న చిన్న ప్రయివేటు ఆస్పత్రుల్లో వారానికి రూ.2.5 లక్షల వరకూ చార్జ్‌ చేస్తుండగా, కార్పొరేటు ఆస్పత్రుల్లో రూ.3.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ చార్జ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ర్యాపిడ్‌ ఆంటిజెన్‌ టెస్టుకు రూ.750, విఆర్‌డిఎల్‌ పరీక్షకు రూ.2800 మాత్రమే చార్జ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా కార్పొరేట్‌ ఆస్పత్రులు మాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ముఖ్యంగా ఈ కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ ఆరోగ్య భీమా ఉన్న రోగులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. రోగి ఆస్పత్రిలో చేరే సమయానికి భీమా కంపెనీతో ఆస్పత్రి యాజమాన్యం ఒప్పందం చేసుకుని వైద్యం అందిస్తుంది. 
 
వాస్తవానికి ఆరోగ్యశ్రీ ఎమ్‌పానల్‌మెంట్‌లో ఉన్న ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందించాలి. ఎమ్‌పానల్‌మెంట్‌లో లేని ఆస్పత్రుల్లో చేరినవారి నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. కానీ ఇక్కడ ఎమ్‌పానల్‌మెంట్‌ ఉన్నా, లేకపోయినా ఆరోగ్యశ్రీని పక్కనపెట్టి ప్యాకేజీ రూపంలో వైద్యం అందిస్తున్నారు. 
 
పైగా వైద్యం పూర్తయిన తరువాత రోగులకు ఎటువంటి బిల్లులు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణలో ఇటువంటి ఆరోపణలున్న వెనకాడుతున్నది.