ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌

ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌
కరోనా బారిపడిన ప్రముఖుల జాబితాలో  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేరారు. తాను స్వల్పంగా అనారోగ్యం బారినపడ్డానని, కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. డాక్టర్ సలహా ప్రకారం ఆసుపత్రిలో చేరానని, ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం కరోనా బారినపడగా గతవారం  ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు, నిన్న   తెలంగాణలోని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారినపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కరోనా బారినపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి శివాజీరావ్ పాటిల్ నీలంగేక‌ర్ క‌న్నుమూశారు. గ‌త నెల 16న క‌రోనాతో ఆయన పుణెలోని ఓ ద‌వాఖాన‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో 91 ఏండ్ల‌ పాటిల్‌ ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించార‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.
ఇలా ఉండగా,  వరుసగా ఏడో రోజు భారత్ లో  50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు వెలుగు చూడగా ఒక్క రోజే 857 మంది మృత్యువాత ప​డ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 19,08,255 మంది కరోనా బారిన పడగా, మంగళవారం నాటికి 39,795 మరణాలు సంభవించాయి.
కాగా 4,57,956 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2,68,285 పాజిటివ్‌ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 1,76,333 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఇక కర్ణాటకలో 1,45,830 మందికి కరోనా సోకగా.. ఢిల్లీలో 1,39,156 మంది వైరస్‌ బారిన పడ్డారు.