ప్లాస్మాదాతలతో గవర్నర్ రక్షాబంధన్ 

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ను వినూత్నంగా జరుపుకున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుని ప్లాస్మాదానం చేసి సీరియస్‌గా కండిషన్‌లో ఉన్నఎందరో ఇతర కోవిడ్‌ పేషెంట్లను కాపాడిన మొత్తం 13 మంది ప్లాస్మాదాతల రక్షాబంధన్‌ జరుపుకున్నారు. 
 
వారికి రాఖీలు, స్వీట్లు అందించారు. రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో జరిగిన రాఖీ సంబురాల్లో భాగంగా గవర్నర్‌ ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, దానం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలను‌ అభినందించారు. మిగిలిన వారికి స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు. 
 
కోవిడ్‌ బారిన పడిన 13 మంది దాతలు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఇదే విషయాన్నిగవర్నర్‌ ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వ హాస్పిటల్స్‌,అక్కడి వైద్యులు గొప్ప సేవలు చేస్తున్నారని అభినందించారు.
 

ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్‌ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు,ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని గవర్నర్‌ చెప్పారు.

 ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కూడా తమ వద్దకు వస్తున్న కోవిడ్‌ పేషెంట్లకు తక్కువ ఖర్చుతో మానవతా దృక్పధంతో సేవలు అందించాలని కోరారు. రోగులను, వారి కుటుంబ సభ్యులను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 

గవర్నర్‌ తమిళిసై అభినందనలు అందుకున్న వారిలో ప్లాస్మా దాతల్లో రాంతేజ గంపాల, నాలుగుసార్లుప్లాస్మాదానం చేసిన ఐఐటి, గ్రాడ్యుయేట్‌ నితిన్‌కుమార్‌, రాష్ట్రంలో మొదటి ప్లాస్మాదాత ఎన్నంశెట్టి అఖిల్‌తో పాటు సురం శివ ప్రసాద్‌, సయ్యద్‌ ముస్తాఫా ఇర్ఫాన్‌, రామకృష్ణగౌడ్‌, శివానంద్‌, డా.సాయిసోమసుందర్‌, డా. రూప దర్శిని తదితరులు ఉన్నారు.