చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జి

జమ్ముకశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన రైలు బ్రిడ్జి నిర్మాణమౌతోంది. ఇది వచ్చే ఏడాదికి రెడీ అవుతుంది. భారత్ లోని మిగతా ప్రాంతాలకు కశ్మీర్ లోయతో మొట్టమొదటిసారి ఈ బ్రిడ్జి వల్ల అనుసంధానం ఏర్పడుతుంది.

పునాది స్థాయి నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మాణమౌతున్న ఈ బ్రిడ్జి స్తంభాల మధ్య 467 మీటర్ల వెడల్పు ఉంది. ఢిల్లీ లోని కుతుబ్‌మీనార్ ఎత్తు 72 మీటర్లు కాగా, ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు. వీటన్నిటికన్నా ఈ రైలు బ్రిడ్జి ఎత్తులో ఉంటుంది.

గంటకు 266 మైళ్ల గరిష్ట వాయువేగం ఉండేలా ఈ వంతెన డిజైన్ చేశారు. 2022 డిసెంబర్ నాటికి కశ్మీర్‌కు రైలు సౌకర్యం సమకూరుతుంది. గత ఏడాది నుంచి బ్రిడ్జి నిర్మాణం జోరుగా సాగుతోంది. 

ఉధంపూర్ కత్రా (25 కిమీ) సెక్షను, బనిహల్ క్వజిగుండ్ (18) కిమీ సెక్షన్, క్వాజిగుండ్ బారాముల్లా  (118కిమీ) సెక్షన్ ఈపాటికే ప్రారంభమయ్యాయి. ఇంకా మిగిలిన ఆఖరి సెక్షన్ 111 కిమీ కత్రాబనిహల్ సెక్షన్ ప్రస్తుతం నిర్మాణం అవుతోంది. 

2022 డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. మొత్తం 174 కిమీ పొడవైన సొరంగ మార్గంలో 126 కిమీ వరకు నిర్మాణం పూర్తయింది.