`రిమ్స్’ అంటే భయపడుతున్న కరోనా రోగులు 

ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో పాలన గాడి తప్పడంతో అక్కడ చేరాలంటే కరోనా రోగులు భయపడుతున్నారు. ఈ మధ్య ఐసోలేషన్‌ కేంద్రం నుంచి 10మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తులు సరైన వైద్యసేవలు అందక పారిపోవడంతో కలకలం చెలరేగింది. డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ కొత్తగా ఎవ్వరిని నియమించకుండా ఒక వైపు సీనియర్ డాక్టర్లు, మరో వంక స్థానిక రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. 
 
వైద్యుల ఖాళీల భర్తీకి వైద్యులే అడ్డుపడుతున్నారంటూ రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కొత్త డాక్టర్లు వస్తే ఎక్కడ తమ ప్రాధాన్యం తగ్గుతుందోనని కొందరు సీనియర్ డాక్టర్లు రిక్రూట్ మెంట్ అడ్డు తగులుతుండడంతో రోగులకు సరైన సేవలు అందడంలేదు.   రిమ్స్ డైరెక్టర్ , డాక్టర్ల మధ్య నెలకొన్న విభేదాలు రోగులకు ఇబ్బంది పాలుచేస్తున్నాయి. దవాఖాన ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి.
 
ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దదిక్కుగా నిలవాల్సిన రిమ్స్ ఆస్పత్రిలో డైరెక్టర్ బలరాం నాయక్, డాక్టర్ల మధ్య సఖ్యత కొరవడింది. డైరెక్టర్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో డాక్టర్లు వారం రోజుల పాటు ఆందోళనలు సైతం చేపట్టారు. 
 
అప్పటి కలెక్టర్ శ్రీదేవసేన జోక్యంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా ఆ తర్వాత మళ్లీ మొదలయ్యాయి . దీంతో హాస్పిటల్ సిబ్బందిపై డైరెక్టర్ ఆజమాయిషీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవకి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. 
 
విధులను నిబంధనల మేరకు నిర్వహించాలానే డైరెక్టర్ ఆదేశాలను జీర్ణించుకోలేని డాక్టర్లు తమ ఉనికిని కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్టర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
 
స్థా నిక అధికార పార్టీ పెద్దలు అండగా ఉండడంతో నే వారంతా ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోగులకు సరైన వైద్య సేవలకు అందడంలేదని ఆరోపణలొస్తున్నాయి.