విశాఖ వైపు జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు 

వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో పాలనారాజధాని విశాఖవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  వడివడిగా అడుగులు వేస్తున్నది. గవర్నర్‌ ఆమోదం తెలిపి 24 గంటలు గడవక ముందే పోలీస్‌శాఖ తొలి అడుగేసింది. నూతన పాలనా రాజధానిలో అవసరమైన సిబ్బంది, సౌకర్యాలు, భద్రత.ఇతర మౌలిక సదుపాయాలపై ఒక కమిటీని డిజిపి నియమించారు.
 
ఈ మేరకు శనివారం జారీ చేసిన ఆదేశాల్లో విశాఖ పోలీసు కమిషనర్‌ నేతృత్వంలో 8 మంది ఉన్నతాధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఆగస్టు 15 వ తేదిలోగా ఈ కమిటీ డిజిపికి నివేదిక ఇవ్వనుంది. ఈలోగానే తరలింపు దిశలో మరికొన్ని కీలక చర్యలకు ఆ శాఖ సిద్ధమౌతోంది. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తితో వాయిదా పడిన విద్యాసంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ఈ లోగానే తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే సచివాలయం తోపాటు హెచ్‌ఓడిల సిబ్బంది నెలాఖరుకల్లా తరలివెళ్లడానికి కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళిక ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.  

అమరావతిలో సచివాలయం,హెచ్‌ఓడిలు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న సంగతి తెలిసిందే. హెచ్‌ఓడిలకు సంబందించి కొన్ని కార్యాలయాలు విజయవాడలో ఉండగా, మరికొన్ని కృష్ణా జిల్లాలో ఉన్నాయి. వీటన్నింటిని తాడేపల్లి ప్రాంతానికి తరలించాలని భావించినప్పటికీ ఆ పని జరగలేదు. 
 
ఈ నేపథ్యంలో నూతన పరిపాలన రాజధానిలో సచివాలయం, హెచ్‌ఓడిలు వీలైనంత దగ్గర్లో ఉండాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రెవెన్యూ అధికారులతో కమిటీని నియమించారు. ఈ నేపథ్యంలో శనివారం సెలవు దినం అయినప్పటికీ అందుబాటులో ఉన్న సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు సమావేశమై తరలింపు ప్రక్రియపై చర్చించినట్లు తెలిసింది. 
 
తరలింపు పరిహారం, డిఏ పెంపు తదితర అంశాలపై ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రాలేదని, తరలివెళ్లిన తరువాత చెల్లింపులు జరకపోతే ఇబ్బంది తలెత్తుతుందంటూ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చసాగినట్లు తెలిసింది.