జీవితానికి తోడ్పడ్డమే నూతన విద్యావిధాన లక్షం    

జీవితానికి తోడ్పడ్డమే నూతన విద్యావిధాన లక్షం    
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన విద్యావిధానంలో మార్పులు తీసుకు వచ్చే లక్షంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకు వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉద్యోగాలను అన్వేషించే వారుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా యువతను తీర్చిదిద్దడమే దీని లక్షమని పేర్కొన్నారు. 
 
‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2020’ ఫినాలే కార్యక్రమంలో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  మాట్లాడుతూ విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇది కేవలం విధానపత్రం కాదు. 130 కోట్లకుపైగా భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని చెప్పారు. 
 
21వ శతాబ్దం జ్ఞానకేంద్రమని పేర్కొంటూ అందరూ నేర్చుకోవడం, పరిశధించడం,ఆవిష్కరించడంపై దృష్టిపెట్టాలని పిలుపిచ్చారు. యువత ఎప్పుటడూ చదవడం, ప్రశ్నించడం, సమస్యను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని ప్రధాని  విద్యార్థులకు సూచించారు. నేర్చుకున్నప్పుడే ప్రశ్నించే జ్ఞానం అలవడుతుందన్నారు. బరువైన బ్యాగులకు స్వస్తిచెప్పి జీవితానికి సాయపడే విద్యను అందించడమే నూతన విద్యావిధానం ముఖ్య లక్షణమని ప్రధాని వెల్లడించారు. 
 
దేశంలో భాష సున్నితమైన అంశమని, నూతన విద్యావిధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి కూడా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి చాలా పెద్ద జనాభా ఉంది.ఇందులో బాగా చదువుకున్న వారు ఉన్నారు. అయితే వారున చదివిన వాటిలో చాలావరకు వారి నిజజీవితంలో పని చేయదని గుర్తు చేశారు. 
 
డిగ్రీల తర్వాత డిగ్రీ చేసినా కూడా తనలో సామర్థం కొరవడిన కారణంగా అసంపూర్ణత గల విద్యార్థి అవుతాడని, అయితే కొత్త విద్యావిధానం ద్వారా ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు.  భారత దేశ విద్యావిధానంలో ఒక క్రమబద్ధమైన సంస్కరణగా దీనిని అభివర్ణించారు.
 
విద్య యొక్క ఉద్దేశం, కటెంట్‌ను మార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రధాని తెలిపారు. ‘దేశ యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను. ఈ నమ్మకాన్ని ఈ దేశంలోని యువత పదేపదే నిరూపించింది. ఇటీవల కరోనానుంచి రక్షించడానికి ఫేస్ షీల్డ్‌కోసం డిమాండ్ పెరిగింది. 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ కొరతను తీర్చడానికి యువత ముందుకు వచ్చింది’ అంటూ ప్రధాని వారిని కొనియాడారు. 
 
“దేశంలోని పేదలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ఈజ్‌ఆఫ్ లివింగ్ అనే మా లక్షాన్ని సాధించడంలో మీ అందరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ద్వారా గతసంవత్సరాల్లో దేశానికి అద్భుతమైన ఆవిష్కరణలు లభించాయి. ఈ హ్యాకథాన్ తర్వాత కూడా దేశ అవసరాలనుఅర్థం చేసుకుని, దేశాన్ని స్వాలంబనగా మార్చడానికి కొత్త పరిష్కారాలపై కృషి చేస్తూనే ఉంటారని యువతపై నాకు నమ్మకం ఉంది’ అంటూ ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.