విశాఖలో భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి

విశాఖపట్నంలోని హిందూస్తాన్‌ షిప్ యార్డులో ప్రమాదం చోటుచేసుకుంది. లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా కొత్తగా వచ్చిన క్రేన్ అకస్మాత్తుగా విరిగిపడటంతో  అక్కడే పనిచేస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారో తెలియాల్సివుంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు  తెలియాల్సి ఉంది. కొత్తగా వచ్చిన క్రెన్ సాంకేతిక లోపమే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులు షిప్‌ యార్డుకు చేరుకున్నారు. అయితే వారిని లోనికి అనుమతించడం లేదు. ఈ భారీ క్రేన్‌ బరువు 75 మెట్రిక్‌ టన్నులు. 10 ఏళ్ల కిందట దీనిని షిప్‌ యార్డు కార్యకలాపాల నిమిత్తం కొనుగోలు చేశారు.
ఈ క్రేన్‌ హిందూస్థాన్‌ షిప్‌ యార్డుకు చెందినదే అయినా దాని నిర్వహణను ఇటీవలే ఔట్‌ సోర్సింగ్‌ సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎల్‌జి గ్యాస్‌ లీకేజీ, ట్యాంక్‌ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా తాజాగా షిప్‌ యార్డు దుర్ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన మూడు నెలల్లో జరిగిన వరుస ఘటనలు సరికొత్త చర్చకు తావిస్తున్నాయి.
ఈ ప్రమాదంపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. మరణాలు సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సిఎం, ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌లను ఆదేశించారు.
షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కు  ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు.