మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు.
 
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014 నుంచి 2018 వరకు 
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో  దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాణిక్యాల‌రావు ఫోటో గ్రాఫ‌ర్‌గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. 

తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నేత ఈతకోట తాతాజీకి(భీమ శంకరరావు) కరోనా సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు గుర్తించక ముందు, మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆయనతో కలిసి కారులో ప్రయాణించారు. తాతాజీకి కరోనా సోకినట్టు తెలిసి మాణిక్యాల రావు కూడా ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరగా కోలుకోవాలని జూలై 25న ట్వీట్ చేసిన మాణిక్యాలరావు తన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ఎవరు నమ్మవద్దని, కంగారు పడవద్దని, అధైర్య పడవద్దని ట్వీట్ చేశారు.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో, అందరి ఆదరాభిమానాలతో తాను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని మాణిక్యాల రావు చివరిగా ట్వీట్ చేశారు. అంత ధైర్యంగా ఉన్న మాణిక్యాలరావు కరోనా వల్ల మరణించడంతో ఆయన అనుచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు.