ఈ శతాబ్దానికి ఈ విద్యే అవసరం  

ఉన్నత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఉపాధి, వృత్తి నైపుణ్యాల కల్పనే ధ్యేయంగా 21వ శతాబ్దానికి అవసరమైన విద్యా విధానాన్ని అందచేయడమే జాతీయ విద్యా విధానం-2020 ఆశయమని నివేదిక రూపకల్పన కమిటీ చైర్మన్ కె కస్తూరి రంగం తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సరళీకృతమైన లేదా బహుల అంశాలతో కూడిన విద్యను అందచేయడం, ఉన్నత విద్యను నాలుగు సంవత్సరాలకు పెంచడం వెనుక ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. 

విద్యార్థులకు నైపుణ్యాలు అలవడడంతోపాటు ఉపాధి అవకాశాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కస్తూరి రంగన్వివరించారు. సమాచార మార్పిడి, సృజనాత్మకత, సమస్యాపూరణం వంటి 21వ శతాబ్దానికి సంబంధించిన అవసరాలకు తగ్గట్టుగా కొత్త విద్యా విధానం ఉంటుందని, వృత్తి నైపుణ్యాలతో కూడిన విద్యను విద్యార్థులు పొందగలుగుతారని ఆయన స్పష్టం చేశారు.

విద్యను సరైన గాడిలో పెట్టడంతోపాటు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆయా రంగాలలో సాధిస్తున్న నూతన ఆవిష్కరణలను ఉపయోగించి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందచేయడమే నూతన విద్యా విధానం ప్రధాన లక్షమని చెప్పుకొచ్చారు. అయితే నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండబోదని ఇస్రో మాజీ చైర్మన్ రంగన్ భరోసా ఇచ్చారు.

మూడేళ్ల స్థానంలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టడంలోని హేతుబద్ధతను వివరిస్తూ విద్యార్థి ఒక్కో ఏడాది విద్యార్థి ఒక్కో అంశంపై నైపుణ్యాన్ని సాధించడానికి ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. నాలుగేళ్ల యుజి కోర్సులో తాను ఎంచుకోనున్న వృత్తిలో ఆ విద్యార్థి సంపూర్ణ పరిజ్ఞానాన్ని సాధించుకుని వృత్తి నైపుణ్యాన్ని పొందగలడడని ఆయన వివరించారు.

ఎంఫిల్ డిగ్రీని రద్దు చేయడంపై స్పందిస్తూ సైన్స్, ఆర్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న కారణంగా దీని ఉపయోగం కనపడడం లేదని పేర్కొన్నారు. మాస్టర్స్ డిగ్రీతో ఎంఫిల్ పోటీ పడలేకపోతోందని, ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని ఎంఫిల్ అందచేయలేకపోతోందని ఆయన తెలిపారు.

ఐదవ తరగతి వరకు పిల్లలకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నూతన విద్యా విధానం గురించి మాట్లాడుతూ దేశ జనాభాలో ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు కేవలం 15-16 శాతం మాత్రమే ఉన్నారని, ఇది పెద్ద సంఖ్య కాదని కస్తూరి రంగన్ గుర్తు చేశారు. పుట్టినప్పటి నుంచి పిల్లలు మాతృభాషలోనే బాహ్య ప్రపంచం గురించి తెలుసుకుంటారని, ఇతర భాషలతో పోలిస్తే మాతృభాషలోనే పిల్లలు అన్ని విషయాలను తేలికగా గ్రహించగలరని ఆయన చెప్పారు. 

కొద్ది సంవత్సరాల తర్వాత వారు ఇంగ్లీష్ భాషలో విద్యను నేర్చుకోగలరని, ఈ కారణంగానే ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని తాము ప్రతిపాదించామని ఆయన తెలిపారు. అన్యభాషలతో పోలిస్తే మాతృభాషలోనే పిల్లలు సైన్స్, లెక్కలు నేర్చుకోగలరని ఆయన చెప్పారు.