50 జిల్లా ల్లోనే 80 శాతం కేసులు

దేశంలోని 740 జిల్లాల్లో 50 జిల్లాల్లో నే 80 శాతం కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల పై ప్రభావం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకోసం మూడంచెల ఫార్ములా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

కేసులను తొందరగా గుర్తించడం, టెక్నాలజీతో కాంటాక్ట్ ట్రేసింగ్ ను మరింత పటిష్టం చేయడం, దానికి ప్రజల సహకారం తీసుకోవడం వంటి చర్యలను తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం జరిగిన 19వ మంత్రుల బృందం  (జీవోఎం) సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసులు ఎక్కువగా ఉన్న నగరాలు, జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతామని చెప్పారు. 

హైదరాబాద్ , పుణే, ఠాణే, బెంగళూరు వంటి నగారాపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో కరోనా తీవ్రత తక్కువేనని హర్షవర్ధన్  పేర్కొంటూ స్తుతం దేశంలో వెంటిలేటర్లమీద చికిత్స  తీసుకుంటున్న రోగులు  0.28 శా తం మాత్రమేనని చెబుతూ 1.58 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 2.28 శాతం మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నామని వెల్లడించారు. 

కరోనా ప్రభావంతో  దేశంలో వైద్య  ఉత్పత్తులు పెరిగాయ‌ని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ చెప్పారు.  దేశంలో కరోనా రికవరీ రేటు 64.54 శాతంగా ఉందని తెలిపారు. గురువారం వరకు దేశవ్యాప్తంగా మిలియన్‌ మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు 16,38,870 మంది కరోనా బారినపడ్డారని వెల్లడించారు.   కరోనా బారినపడిన వారిలో 2/3 వంతురోగులు కోలుకుంటున్నారని, ఇప్పటివరకు మరణాల నమోదు శాతం కేవలం 2.18 మాత్రమేనని స్పష్టం చేశారు.