రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త అమర్ సింగ్ (64) శనివారం సింగపూర్‌లో కన్నుమూశారు. ఆరు నెలలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కిడ్నీలు బాగా దెబ్బతినడంతో ఆరు నెలుగా ఆయన సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.
చాలాకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 2009 లో ఒకసారి అదేవిధంగా 2018 లో మరోసారి కిడ్ని మార్పిడి చేయించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ జాతీయ రాజకీయాల్లో ఆయన చాలా క్రియాశీలకంగా ఉండేవారు.
ఈ ఏడాది మార్చిలో అతని మరణంపై పుకార్లు చెలరేగినప్పుడు సోషల్ మీడియా వేదికగా టైగర్ జిందా హై అనే శీర్షికతో ఓ వీడియోను విడుదల చేశారు. తనలో తగినంత ధైర్యం, ఉత్సాహం, ఆత్మశక్తి మిగిలి ఉన్నాయన్నారు. తన అనారోగ్యానికి చికత్స జరుగుతోందని భవానీ మాత ఆశీర్వాదంతో డబుల్ ఎనర్జీతో తిరిగి వస్తానని పేర్కొన్నాడు. అమర్‌సింగ్‌కు భార్య పంకజా కుమారీ సింగ్, కవల కుమార్తెలు ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ములాయం పార్టీ వ్యవహారాలను చక్కబెడితే అమర్ సింగ్ పార్టీకి ‘ఓ ఫండ్ రైజర్’ (ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి)గా వ్యవహరించేవారు. అంతేకాకుండా పార్టీలోకి సినిమా తారలను కూడా తీసుకొచ్చి… పార్టీకి మరింత ఆకర్షణను చేకూర్చారు. నటి జయప్రదను పార్టీలోకి తీసుకొచ్చింది అమర్ సింగే.
ఓ రకంగా చెప్పాలంటే ఢిల్లీలో సమాజ్‌వాదీ పునాదులను ఈయన చాలా పటిష్ఠం చేశారు. ఇంత వెలుగు వెలిగిన అమర్ సింగ్‌ను ఫిబ్రవరి 2, 2010 లో ములాయం సింగ్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అన్ని రంగాలవారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. సినిమా, వ్యాపారం…. ఇలా అన్ని రంగాల వారితోనూ సన్నిహిత సంబంధాలుండేవి.
సోనియా ప్రధాని పదవికి రేసులో ఉండగా అంతర్గతంగా ఈయన తీవ్రంగా వ్యతిరేకించేవారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండేది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉండేవి.
సమాజ్ వాదీ ఈయన్ను బహిష్కరించడంతో 2011 లో రాష్ట్రీయ లోక్‌మంచ్ అన్న కొత్త పార్టీని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో అన్ని స్థానాల నుంచీ అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత 2014 లో రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరారు. చివరికి 2016 లో అదే సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
More Stories
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం
హర్యానాలో కాంగ్రెస్ అంటున్న ఎగ్జిట్ పోల్స్.. బిజెపి ధీమా