నూతన విద్యావిధానంకు ఖుష్భూ మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020కి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖుష్భూ మద్దతు తెలిపారు. అయితే తన అభిప్రాయం పార్టీ వైఖరికి భిన్నమైదని కూడా స్పష్టం చేశారు. ఒక పౌరురాలిగా మాత్రమే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలిపారు.
‘నూతన విద్యా విధానం-2020పై నా వైఖరి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. ఇందుకు రాహుల్‌ గాంధీకి నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిదానికి తలాడించే రోబోలా కాకుండా.. నిజం మాట్లాడాను. ప్రతీది మన నాయకుడి అంగీకారం గురించి కాకూడదు.. పౌరుడిగా మన అభిప్రామాన్ని ధైర్యంగా చెప్పగలగాలి’ అని ఖుష్భూ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
 
దానితో ఆమె ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్‌ సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ట్వీట్‌తో తను పెద్ద దుమారాన్నే చూశానని ఖుష్భూ పేర్కొన్నారు. అంతకు ముందు కూడా సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె మద్దతు తెలిపారు. నూతన విద్యా విధానం-2020 అనేది స్వాగతించదగినదని ఆమె పేర్కొన్నారు.