రుణాల చెల్లింపులపై మారటోరియం పొడిగింపు 

రుణాల చెల్లింపులపై మారటోరియం లేదా రుణాల పునర్వ్యవస్థీకరణ పొడిగింపుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)తో చర్చిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. శుక్రవారం వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో నిర్మల మాట్లాడుతూ ‘కరోనా ప్రభావంతో కుదేలైన పరిశ్రమకు ఊతమిచ్చేలా రుణాల పునర్వ్యవస్థీకరణపై ఆర్బీఐతో చర్చిస్తున్నాం’ అని చెప్పారు. 
 
ముఖ్యంగా ఆతిథ్య రంగం అవసరాలను అర్థం చేసుకున్నామని, వారి డిమాండ్‌ మేరకు మారటోరియం పొడిగింపుపై సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. కొవిడ్‌-19 దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ఆర్బీఐ 6 నెలలపాటు మారటోరియం వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. 
ఆగస్టు 31తో ఇది ముగియనున్నది. 
 
నిజానికి తొలుత మార్చి-మే నెలలకే మారటోరియం అవకాశాన్నిచ్చిన ఆర్బీఐ.. కరోనా ప్రభావ తీవ్రత దృష్ట్యా మరో 3 నెలలు పొడిగించింది. ఆరోగ్య సంరక్షణ, ఇతర ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకుంటుందన్నారు. 
 
కాగా, మారటోరియం గడువును పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్‌ రజ్నీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆగస్టు 31 తర్వాత మారటోరియంను కొనసాగించనక్కర్లేదని ఎస్బీఐసహా చాలా బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. 
 
‘ఆరు నెలలపాటు రుణాలపై చెల్లింపులను వాయిదా వేసింది చాలు’ అని తెలిపారు. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ ఆగస్టు తర్వాత మారటోరియంను పొడిగించవద్దని ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌కు విజ్ఞప్తి చేసినది విదితమే. రుణాలను చెల్లించే స్థోమత ఉన్నవారూ మారటోరియం సాకుతో చెల్లించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ పరిణామం మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరించారు.