కేటీఆర్ కు ట్వీట్ చేస్తే కేసులా!

సమస్య పరిష్కారమవుతుందని కేటీఆర్ కు ట్వీట్ చేస్తే బాధితులపైనే కేసు పెట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన ఇమంది నాగేశ్వర్ రావ్ (69) అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ నెల 23న మధ్యాహ్నం కొత్తగూడెంలోని జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 
 
ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. కరోనాతో ఆయన చనిపోయారంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు. అయితే ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం ఉన్నా ఉపయోగించలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సహకరించకపోయినా కరోనా నిబంధనల ప్రకారమే మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశామని తెలిపారు. 
 
చనిపోయి ఐదు రోజులైనా మృతుడి కుటుంబీకులకు కరోనాటెస్ట్లు చేయలేదు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. విషయంపై జిల్లాకలెక్టర్ దృష్టి సారించాలనే ఆలోచనతో నాగేశ్వరరావ్ మనవడు గణేష్, మనవరాలు వసుధ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. 
 
అయితే కరోనా చికిత్స  విషయంలో అసత్య ప్రచారం చేస్తూ అధికారులు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ నాగేశ్వరరావు కొడుకు ఉదయ్, మనవడు గణేష్లపై డీఎంహెచ్ వో భాస్కర్ నాయక్ కొత్తగూడెంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  వారిద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సైరాఘవ పేర్కొన్నారు.