చైనా కన్నా భారత్ వైపే అమెరికన్లు 

చైనా కన్నా భారత్ వైపే అమెరికన్లు 
భార‌త్‌–‌చైనా మధ్య సైనిక, ఆర్థి‌క‌ప‌ర‌మైన అంశాల్లో వివా‌దాలు తలె‌త్తిన పక్షంలో ఏదో ఒక దేశా‌నికి మద్దతు తెలుపాల్సివస్తే భార‌త్‌కే అమె‌రికా మద్దతు ప్రక‌టిం‌చా‌లని ఎక్కు‌వ‌మంది అమె‌రి‌కన్లు కోరు‌కుం‌టు‌న్నారు. ఆస్ట్రేలియాకు  చెందిన మేధో‌సంస్థ లోవీ ఇన్‌‌స్టి‌ట్యూట్ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. జూలై 7న నిర్వ‌హించిన ఈ స‌ర్వే‌లో 1,012 మంది అమె‌రికా పౌరు‌లు పాల్గొన్నారు. 
 
భారత్‌, చైనా మధ్య సైనిక వివాదం తలె‌త్తితే భార‌త్‌కే అమె‌రికా అండగా నిలు‌వా‌లని 32.6 శాతం మంది కోరు‌కు‌న్నారు. 3.8 శాతం మంది మాత్రమే చైనాకు మద్ద‌తుగా నిలి‌చారు. ఆర్థి‌క‌ప‌ర‌మైన వివా‌దంలో 36.3 శాతం మంది భార‌త్‌కు, 3.1 శాతం మంది చైనాకు అగ్ర‌రాజ్యం మద్ద‌తు‌ని‌వ్వా‌లని ఓటే‌శా‌రని సర్వే వెల్ల‌డిం‌చింది. 
 
మరో‌వైపు, సైనిక వివాదం తలె‌త్తితే ఇరు దేశా‌లకు అమె‌రికా మద్దతు ప్రక‌టిం‌చ‌వ‌ద్దని 63.6 శాతం మంది కోరు‌కు‌న్నారు. ఆర్థిక వివాదం విష‌యంలో 60.6 శాతం మంది ఎవ‌రికీ అమె‌రికా మద్ద‌తును ఇవ్వ‌కూ‌డ‌దని చెప్పా‌రని సర్వే పేర్కొంది.
 
గ‌త‌నెల 15న ల‌ఢ‌క్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన‌ ఘ‌ర్ష‌ణలో 20 మంది భార‌త జ‌వాన్లు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ‌లో చైనాకు చెందిన 45-50 మంది జ‌వాన్లు హ‌త‌మ‌య్యార‌ని తెలిసింది. ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో లోవీ ఇన్‌స్టిట్యూట్ ఈ స‌ర్వే నిర్వ‌హించింది.