చైనా, రష్యా దేశాల్లో రూపొందుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు అమెరికా సుముఖంగా లేదు. పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరుపకుండానే మార్కెట్లో విడుదల చేసే ఈ వ్యాక్సిన్లతో ప్రమాదమని అమెరికా భావిస్తున్నది. అవి సురక్షితమో. కాదో తెలియదని ఆందోళన చెందుతున్నది.
పారదర్శకంగా లేని ఔషధ నియంత్రణ సంస్థలు కలిగిన దేశాల టీకాలను తాము వాడటం కష్టమేనంటున్నారు ఆ దేశ అధ్యక్షుడి సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి. గత ఏడాది చైనాలో చెలరేగిన కరోనా వైరస్ మహమ్మారి భారం కింద నలిగిన తరువాత అమెరికా ప్రస్తుతం అన్నిరకాలుగా చితికిపోయి ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 మిలియన్ల మంది ఈ వైరస్ కు గురవగా ఒక్క అమెరికాలోనే దాదాపు 4.7 మిలియన్ కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉధృత ప్రభావిత దేశంగా మారింది. మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 680,000 ఉండగా.. అమెరికాలో అత్యధికంగా 156,000 కు పైగా నమోదయ్యాయి.
2019 డిసెంబర్‌లో చైనా వుహాన్‌లో మహమ్మారి సంభవించినప్పటి నుంచి చైనా, భారత్‌తో పాటు మిగతా ప్రపంచం మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, రష్యా దేశాలు కొవిడ్ -19 వైరస్ నిర్మూలన కోసం టీకాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాలు పరీక్షలను అమలు చేయకుండా, తమ నిజాయితీని ధృవీకరించకుండా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయని అమెరికా భావిస్తున్నది.
ఇదే విషయాన్ని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి స్పష్టంచేస్తున్నారు. “ఇతరులకు విక్రయించేందుకు అనుమతులు పొందే ముందు వ్యాక్సిన్‌ను చైనా, రష్యా విస్తృతంగా పరీక్షిస్తాయని భావిస్తున్నాం. పరీక్షించకుండానే టీకాలను సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే సమస్య కచ్చితంగా మరింత జటిలం అవుతుంది” అని ఫౌచి మీడియం చెప్పారు.
కాగా, కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్-19 ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు కావడం వల్ల ఆ సంస్థ అధినేత డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రియేసస్ మీడియాతో మాట్లాడారు. మరోవంక సొంతంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఫార్మా దిగ్గజాలు సనోఫి, గ్లాక్సోస్మిత్‌కెలైన్ కు 2.1 బిలియన్ డాలర్లు ఇప్పటికే చెల్లించింది.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ జయకేతనం