సచివాలయ నమూనాలో మరికొన్ని మార్పులు  

సచివాలయ నమూనాలో మరికొన్ని మార్పులు  

తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ నమూనాలో మరికొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  అధికారులను ఆదేశించారు. అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆయన అధికారులను తెలిపారు. 

మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్‌లు కూడా అన్ని సౌకర్యాలతో ఉండే లా చూడాలి అన్నారు. ప్రతి అంతస్తులోనూ డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌, అన్ని వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండే లా నిర్మాణం జరగాలని సూచించారు.

ప్రగతిభవన్‌లో కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌లను ముఖ్యమంత్రి పరిశీలించి ఆర్కిటెక్ట్‌లు సిద్ధం చేసిన నమూనాలో మరికొన్ని మార్పులు సూచించారు. పది రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సందర్భంగా సచివాలయ నమూనాకు సీఎం కొన్ని మార్పులు సూచించిన సంగతి తెలిసిందే. సచివాలయం నమూనా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

ఇందుకు అనుగుణంగా ఆర్కిటెక్ట్‌లు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో చర్చించి రూపొందించిన నమూనాను బుధవారం సీఎంకు నివేదించారు. గత సచివాలయం మాదిరిగా కాకుండా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. దక్షిణ భారతీయ సంప్రదాయం, దక్కన్ కాకతీయ శైలిలో భవన నిర్మాణం జరగనుంది.

ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్ ప్యాలెస్ స్ఫూర్తితో పచ్చికబయళ్లు, తంగేడు పువ్వు ఆకారంలో వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటుతో పాటు తెలంగాణకు కలికితురాయిలా పెద్ద గవాక్షాన్ని నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం డిజైన్లను రూపొందించింది. ఇప్పటికే కూల్చివేతలు పూర్తయిన నేపథ్యంలో వచ్చేనెల కచ్చితంగా నూతన నిర్మాణాన్ని ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం.