బలవంత భూసేకరణతో రైతు ఆత్మహత్య 

బలవంత భూసేకరణతో రైతు ఆత్మహత్య 
సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్  నియోజకవర్గం వర్గల్ మండలం వేలూరుకు చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సీ వర్గానికి చెందిన బ్యాగరి నర్సింహులు అనే రైతుకు చెందిన 13 గుంటల భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆ కారణంతో భూమిని రికార్డుల్లో కూడా ఎక్కించలేదు.
దాంతో మనస్థాపం చెందిన నర్సింహులు బుధవారం పొలం దగ్గరికెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సింహులు గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు.
భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల ఒత్తిడి వల్లే నర్సింహులు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రైతు ఆత్మహత్యపై బీజేపీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
 వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి,మాజీ మంత్రులు  మోత్కుపల్లి నరసింహులు, బాబుమోహన్,  ఎమ్యెల్సీ ఎన్. రామ చందర్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్  లతో నిజ నిర్ధారణ కమిటీని వేశారు.
బ్యాగరి నర్సింహులు మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ కులానికి చెందిన నర్సింహులు మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారని ఆరోపించారు.